ఘనంగా మేడా శ్రీనివాస్‌ పుట్టిన రోజు వేడుకలు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 20 : రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్‌ పుట్టిన రోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. స్దానిక ఆనంరోటరీహాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఆర్యాపురంలోని పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలిగా ఆనంరోటరీహాల్‌కు చేరుకున్నారు. ప్రత్యేక ¬దా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఆనంరోటరీహాల్‌లో తెలుగు ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ముందుగా మేడా శ్రీనివాస్‌ పుట్టిన రోజు కేక్‌ను కట్‌ చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు  పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్బం కూడా కలిసిరావడంతో ఈ సంబరాలను కూడా జరుపుకున్నారు. నిలువెత్తు గజమాలతో, పూల కిరీటంతో మేడా శ్రీనివాస్‌ను అభిమానులు సత్కరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలతో మేడా శ్రీనివాస్‌ను ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.