గన్ని కృష్ణకు త్వరలో గుడ్‌ న్యూస్‌

దంత వైద్య శిబిరంలో ఉప ముఖ్యమంత్రి రాజప్ప
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 20 : ‘తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ అభ్యున్నతి కోసం, కార్యకర్తల, ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వాళ్ళెందరో ఉన్నారు…. ఈ జిల్లా విషయానికి వస్తే వారిలో నేను, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని కృష్ణ తదితర నాయకులు ఉన్నాం… అయితే నాకు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం లభించింది… రెడ్డి సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్సీగా ఆ తరువాత శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా పదవి చేపట్టే ఛాన్స్‌ వచ్చింది…. ఇక గన్ని కృష్ణ ఒకరే మిగిలారు. ఆయన కూడా త్వరలో ఓ గుడ్‌ న్యూస్‌ వింటారు” అన్నారు ఉప ముఖ్యమంత్రి, హోం శాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ఎక్కువ కాలం జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన తాను ఈ జిల్లాలో పార్టీ నేతలందరినీ అధ్యయనం చేశానని, ఎవరి మనస్తత్వం ఏమిటో తెలుసుకుని అందుకనుగుణంగా నడుచుకోవడం, వారిని ఒప్పించడం, మెప్పించడమే తన విజయ రహస్యమని రాజప్ప చెప్పుకొచ్చారు.  సీఎం, తెదేపా జాతీయ అధ్యక్షులు, చంద్రబాబునాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, స్పందన స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గన్ని కృష్ణ నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరంలో రాజప్ప మాట్లాడుతూ పార్టీ కోసం అందరూ కష్టపడుతున్నారని, అయితే ఒకరికి ముందుగా, మరొకరికి తరువాత గుర్తింపు లభిస్తుందని, అలాగే అదృష్టం కొందరిని ముందుగా, కొందరిని తరువాత వరిస్తుందని, ఆ క్రమంలో గన్ని కృష్ణ సేవలకు కూడా త్వరలో గుర్తింపు లభిస్తుందని రాజప్ప చెప్పారు. దీనిపై త్వరలోనే ఓ సానుకూలమైన నిర్ణయం వెలువడుతుందని అన్నారు. పెద్దన్నగా పార్టీలో అందరినీ ఒప్పిస్తూ, మెప్పిస్తూ నడుచుకుంటున్నానని, ఆ విధానంతోనే జిల్లాలో పార్టీని పటిష్టపరిచి కంచుకోటగా తీర్చిదిద్దానన్నారు. అయితే ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ అభ్యున్నతి కోసం, పేదల సంక్షేమం కోసం గత ఎన్నో ఏళ్ళుగా గన్ని కృష్ణ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన  ప్రశంసించారు. సామాజిక సేవా కార్యక్రమాలతో చంద్రబాబు జన్మదినోత్సవాన్ని నిర్వహిస్తున్న గన్ని కృష్ణ అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. రాజప్ప ప్రసంగానికి గన్ని కృష్ణ ముక్తాయింపు ఇస్తూ తాను ఏనాడూ పదవులు ఆశించలేదని, పదవులతో నిమిత్తం లేకుండా పేద ప్రజల సంక్షేమం, పార్టీ అభ్యున్నతే ధ్యేయంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని చెప్పారు. పదవి ఇచ్చినా లేకున్నా తాను ఎన్నడూ చంద్రబాబునాయుడుకు విధేయుడేనని గన్ని వెల్లడించారు.