ఏమిటీ వేలం వెర్రి ? 

 జి.కె.వార్తా వ్యాఖ్య
 వినోద సాధనంలో సినిమా ఓ బలమైన ఆయుధం. దైనందిన సమస్యల నుంచి కాస్త రిలీఫ్‌ కోసమో, ఆహ్లాదం, ఆనందం కోసమో మన వినోద ప్రపంచం వైపు అడుగులేస్తాం….వినోదం అనగానే మనలో చాలా మంది సినిమా పట్లే ఆకర్షితులవుతాం….ఇంట్లో టీవీల్లో వివిధ ఛానళ్ళలో అనుక్షణం అనేక సినిమాలు వస్తున్నా పలు కారణాలతో ధియేటర్లలో సినిమా చూడడానికే మనం ప్రాధాన్యం ఇస్తాం…అందులో అగ్ర హీరోల చిత్రాలైతే విడుదలైన తొలినాళ్ళలోనే చూసేందుకు ముందే పరిగెడతాం….ముఖ్యంగా ఆ చిత్రంలో  భారీ సెట్టింగ్‌లు, గ్రాఫిక్స్‌ గురించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ  జరిగితే ఇక వేరే చెప్పనక్కర్లేదు. విడుదలైన రోజునో, ఆ మర్నాడో ఆ చిత్రాన్ని చూసి గర్వంగా ఫీలయ్యేవారు, అనిర్వచనీయమైన ఆనందం పొందే వారే అత్యధికులు. అందులో అభిమాన హీరో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇతర హీరోల అభిమానులు కూడా ఆ చిత్రం ఎలా ఉందో అన్న ఉత్సుకతతో చూడడానికి ఎగబడతారు. అభిమానుల్లో యువతే అత్యధికులు కావడంతో ఇక ఆ హంగామా  ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క పర్యాయం అభిమానం దురభిమానంగా మారుతున్న సందర్భాలూ లేకపోలేదు. హీరోలంతా స్నేహభావంతో కలిసి మెలిసి సాగుతుంటే దిగువ స్థాయిలో అభిమానులు మాత్రం బాహాబాహికి దిగిన సంఘటనలు కోకొల్లలు. భారీ సెట్టింగ్‌లు, గ్రాఫిక్స్‌తో నిర్మించిన చిత్రాలంటే యువత ముందే పరుగులు పెడతారు. అందునా ఆ చిత్రాల గురించి జరిగే విపరీతమైన పబ్లిసిటీ వారిని మరింత ఉసిగొల్పుతుంది. ఇక్కడే  అసలు కథ మొదలవుతుంది. సినీ ప్రేక్షకుల ముఖ్యంగా యువత బలహీనతను ఆసరాగా తీసుకుని చిత్ర నిర్మాణ సంస్థ మొదలుకుని ఎగ్జిబిటర్‌ వరకు వారిని దోచుకుందామనే చూస్తారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది వేల ధియేటర్లలో  విడుదలైన బాహుబలి 2  భారీ బడ్జెట్‌ చిత్రం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. మనం ఇంతవరకు క్రికెట్‌ బెట్టింగ్‌లే చూశాం. ఈ చిత్రం ద్వారా ఇపుడు సినిమా బెట్టింగ్‌లు కూడా మొదలయ్యాయి. ఈ చిత్రం విదేశీ చిత్రాల కలక్షన్లను తలదన్ని వసూళ్ళు చేస్తుందని బెట్టింగ్‌లు కూడా కాశారు. ఇదంతా చూస్తుంటే మనం ఎటు వెళుతున్నామో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇంత విశాల భారత దేశంలో మరే సమస్యలు లేనట్టుగా గత కొద్ది రోజులుగా అందరి చూపు, చర్చ ఈ సినిమాపైనే అంటే ఆవేదన కలిగిస్తోంది. విద్యార్ధులకు అసలే ఇది పరీక్షా కాలం… ఈ సమయాన   ఈ సినిమా గురించి చర్చ, బెట్టింగ్‌లు, విడుదలయ్యాక చూడాలన్న ఆతృత వెరశి యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతోంది.  అంతకు మించి ఈ చిత్రం పేరుతో ప్రేక్షకులను దోచుకోవడం దారుణంగా ఉంది. చిత్ర నిర్మాణ సంస్థ కోరిందని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చిత్రం అత్యధిక షో లను ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు టిక్కెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో అంతా కుమ్మక్కై ప్రేక్షకుల దోపిడీకి తెర తీశారు. బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టి ధియేటర్ల  నిర్వహణను పర్యవేక్షించవలసిన పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగాలు ఈ విషయంలో   ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయంటే  అతిశయోక్తి కాదు. ధియేటర్ల వద్ద పరిస్థితి చూస్తే  సినిమా టిక్కెట్ల బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టవలసిన ఈ విభాగాల సిబ్బంది కళ్ళు మూసుకున్నారా అనే అనుమానం కలుగుతోంది. దీంతో ప్రేక్షకుల దోపిడీ యదేచ్ఛగా కొనసాగిపోతోంది. అసలే ధియేటర్లలో టిక్కెట్ల ధరలు అధికంగా ఉన్నాయనుకుంటే ఈ చిత్రం గురించి విపరీతమైన పబ్లిసిటీ, ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ఫలితంగా ధియేటర్ల యాజమాన్యాలు ముఖ్యంగా మల్టీఫ్లెక్స్‌ల నిర్వాహకులు  టిక్కెట్ల ధరలు అమాంతంగా పెంచేశారు. బెనిఫిట్‌ షోల  టిక్కెట్ల ధరలైతే ఆరొందలు పైనే  దాటేసాయి. కొన్ని చోట్ల రెండు వేల రూపాయలకు కూడా విక్రయించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతోంది. అసలు ఈ బెనిఫిట్‌ షోలు ఎవరి  ‘బెనిఫిట్‌’కో అర్ధం కావడం లేదు. బాహుబలి 2 చిత్రాన్ని చాలా గొప్పగా తీసి ఉండొచ్చు….దీని నిర్మాణానికి భారీ వ్యయం అయి ఉండొచ్చు…. అలాగని ప్రేక్షకులను దోపిడీ చేస్తుంటే  ప్రభుత్వ యంత్రాంగం ఇందుకు సహాయపడటం విస్మయం కలిగిస్తోంది. ఈ దోపిడీ ఒక్క రాజమహేంద్రవరంలోనే కాదు ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొనడం బాధాకరం. ఈ పరిణామాలకు ఎవరో ఒకరు బాధ్యులు కారు. అందరూ పాత్రధారులే. అయితే చివరకు నష్టపోయేది మాత్రం ప్రేక్షకులే. ఇంత సువిశాల భారతదేశంలో  వేరే సమస్యలేమీ లేనట్టుగా  ఇదే పెద్ద సమస్య అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు క్షమార్హం కాదు. ముఖ్యంగా సామాజిక సమస్యలపై కత్తి దూయవలసిన ప్రింట్‌ ,ఎలక్ట్రానిక్‌ మీడియా  కూడా ఈ చిత్రం గొప్పదనం గురించి విపరీతమైన ప్రచారం చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్సుకత పెంచుతూ ఈ విపరీతమైన ధోరణిి, పరిణామాల్లో తానూ భాగస్వామ్యమైంది. బాధ్యతయుతంగా వ్యవహరి ంచవలసిన మీడియా, సినిమాల ద్వారా సామాజిక సందేశాన్ని వ్యాప్తి చేయవలసిన సినీ లోకం ధోరణి మారకుంటే మనం ఎటు పయనిస్తున్నామో మనకే తెలియని గందరగోళం ఏర్పడుతుంది. బహు పరాక్‌ !…..