తుమ్మలావ రిఫరల్‌ హాస్పటల్‌ని ఆధునికీకరించాలి

అర్బన్‌ హెల్త్‌ కమిటీ చైర్మన్‌ కొమ్మ శ్రీనివాసరావు
రాజమహేంద్రవరం,  ఏప్రిల్‌ 29 : పేదలకు ఉపయోగపడే తుమ్మలావ ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్‌ను ఆధునీకరించి అధిక సిబ్బందిని నియమించాలని అర్బన్‌ హెల్త్‌ కమిటీ చైర్మన్‌ 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ కొమ్మ శ్రీనివాసరావు అన్నారు. కార్పొరేట్‌ వైద్యం చేయించుకోలేని స్త్రీలు ఎఫ్‌ఆర్‌యులో సాధారణ ప్రసవాలు ఉచితంగా చేయించుకోవచ్చన్నారు.  గర్భిణీలకు ప్రసవానంతరం రోజుకు ఏభై రూపాయలు, ఇంటికి వెళ్ళినప్పుడు ఆరు వందల రూపాయలు పారితోషికంగా ఇస్తున్నారని కొమ్మ పేర్కొన్నారు. ఈ హాస్పటల్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, పోలియో చుక్కలు, కుక్కకాటు వ్యాక్సిన్లు ఉచితంగా వేస్తున్నారన్నారు. హెల్త్‌ కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ సత్యదేవ్‌, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఇందిర పర్యవేక్షణలో బృహన్నలపేట, ఆనందనగర్‌లో ఉన్న ముఖ్యమంత్రి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాలలో కంప్యూటర్‌ ద్వారా రోగి యొక్క సమాచారం సేకరించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఉచితంగా ఔషధాలు రోగికి ఇస్తున్నారని, క్రిటికల్‌ వ్యాధుల గురించి టెలి కన్సల్టేషన్‌ ద్వారా సలహాలు, సూచనలను పొందవచ్చని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని హెల్త్‌ కమిటీ కోరింది. కార్యక్రమంలో కార్పొరేటర్‌ మజ్జి పద్మ, కోసూరి చండీప్రియ, మజ్జి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు.