‘వికాస్‌’ ఆధ్వర్యంలో ప్రతిభ గల విద్యార్ధికి నగదు పురస్కారం 

 రాజమహేంద్రవరం,  ఏప్రిల్‌ 29 :  స్థానిక వి.ఎల్‌.పురం పార్కులోని వికాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉన్నత చదువులలో రాణిస్తున్న పేద విద్యార్ధులకి ఇచ్చే ఉల్లంపర్తి శాంతరాజు స్మారక క్యాష్‌ అవార్డు రూ.ఐదువేలును వి.టి.జూనియర్‌ కళాశాలలో చదివి హెచ్‌ఇసిలో 902 మార్కులు సాధించిన ముప్పన నిషి ప్రియాంకకు రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు యార్లగడ్డ ప్రభాకర్‌, నందిన వెంకటప్రసాద్‌, నూకారపు ముత్యాలరావు, అధ్యక్షురాలు రత్న జ్ఞానకుమారి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మురళీమోహన్‌ మాట్లాడుతూ చదువుకు పేదరికం ఆటంకం కాదని, బాగా చదివే విద్యార్ధులకు ఎవరైనా సహాయం చేస్తారని, చదువు మనిషిని ఏ స్థాయికైనా తీసుకు వెళ్తుందని, ఇంకా బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని నిషిని ఆశీర్వదించారు. వికాస్‌ సొసైటీ ద్వారా యార్లగడ్డ ప్రభాకర్‌ వృద్ధులకు, విద్యార్ధులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని, ఇటువంటి అధ్యాపకులు ఆదర్శప్రాయమని ఎంపి పేర్కొన్నారు.