భయం గుప్పెట్లో చారిత్రక నగరం

పేట్రేగుతున్న రౌడీ సంస్కృతి – నిద్రపోతున్న నిఘా వ్యవస్థ
మేల్కొనకపోతే పరిస్థితి చేజారే ప్రమాదం – రాజప్ప దృష్టికి తీసుకెళ్ళిన గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, మే 13 : ‘కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందట’ అన్న చందాన తయారైంది రాజమహేంద్రవరంలో శాంతిభద్రతల పరిస్థితి. పెరిగిన జనాభా, పెరుగుతున్న నేరాలు, అదుపు తప్పుతున్న శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీస్‌ సబ్‌ డివిజన్‌ స్థాయిలో ఉన్న రాజమహేంద్రవరాన్ని అర్బన్‌ పోలీస్‌ జిల్లా స్థాయికి పెంచితే శాంతి భద్రతలు పరిఢవిల్లుతాయనే గట్టి నమ్మికతో ఐదేళ్ళ క్రితం అర్బన్‌ జిల్లా హంగులతో పోలీస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయగా పరిస్థితి మాత్రం ‘నానాటికి తీసికట్టు నాగంబొట్లు’ అన్నట్లు అధ్వాన్నంగా మారింది. ఇప్పుడు దిగజారిన శాంతి భద్రతలు, పెరిగిన నేరాలు చూస్తుంటే ఎలాంటి హంగు, ఆర్భాటం లేనప్పుడే రాజమహేంద్రవరం ప్రశాంతంగా ఉండేదేమో అనిపిస్తోంది. గతంలో ఒక డిఎస్పీ స్థాయి అధికారి, టౌన్‌ సి.ఐ., రూరల్‌ సి.ఐ.లతో పాటు నగరంలోని మూడు స్టేషన్లు, పరిసర ప్రాంతాల స్టేషన్లకు ఎస్‌.ఐ.లు, అరకొరగా సిబ్బంది ఉండేవారు. అయితే ఇపుడు ‘మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన’ తీరుగా సిిబ్బంది సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగినా శాంతిభద్రతలు మాత్రం కొరవడుతున్నాయి. అర్బన్‌ జిల్లాగా ఆవిర్భవించాక ఐఏఎస్‌ స్థాయి అధికారి ఎస్పీగా, ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలతో పాటు నాలుగు జోన్లకు నలుగురు డిఎస్పీలు, ప్రతి స్టేషన్‌కు సిఐ స్థాయి అధికారి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌తో పాటు ప్రతి స్టేషన్‌కు ఇద్దరు లా అండ్‌ ఆర్డర్‌ ఎస్‌ఐలతో పాటు ఇద్దరు ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళు, క్రైం విభాగానికి ప్రత్యేకంగా ఎస్‌.ఐ., సిఐలతో పాటు పెద్ద సంఖ్యలో హోం గార్డులు నియమితులయ్యారు. ప్రత్యేకంగా యాంటీ గూండా స్వ్కాడ్‌ కూడా ఏర్పాటైంది. అలాగే అర్బన్‌ జిల్లాకు ప్రత్యేకంగా సాయుధ రిజర్వ్‌ పోలీస్‌ కార్యాలయం కూడా సమకూరింది. అర్బన్‌ జిల్లా ఏర్పడ్డాక అదనంగా మరి కొంతమంది సిబ్బందిని, వాహనాలను కేటాయించారు. ప్రకాశంనగర్‌ పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌ను పూర్తి స్థాయి స్టేషన్‌ (ఫోర్త్‌ టౌన్‌)గా అప్‌గ్రేడ్‌ చేశారు.  దీంతో నగరంలో శాంతిభద్రతలు మెరుగుపడతాయని, ధీమాగా నిద్రించవచ్చు…తిరగొచ్చు…అని చాలా మంది సంబర పడ్డారు. అయితే నగరంలో ఇటీవల పరిస్థితులు అందుకు భిన్నంగా మారి అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నిఘా వ్యవస్థ నిద్రపోతోంది. ముఖ్యంగా పేట్రేగిన రౌడీయిజం సంస్కృతి కలవరపరుస్తోంది. చోరీలు, హైటెక్‌ వ్యభిచారం, దారి దోపిడీలు, చైన్‌ స్నాచింగ్‌ల సంగతి సరే సరి. బ్లేడ్‌బ్యాచ్‌ల దాడులు కూడా ఇటీవల కాలంలో పెరిగిపోయాయి.  స్వైర విహారం చేస్తున్న అరాచక శక్తుల చర్యలతో ఎప్పుడు ఏం జరుగుతోందనన్న భయంతో వణికిపోతున్నారు. దీంతో చారిత్రక నగరానికి ఉన్న ప్రతిష్ట మసకబారుతోంది. సినీ ఫక్కీలో పట్టపగలే నిర్భయంగా రౌడీ మూకలు అరాచక చర్యలకు పాల్పడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. తాజాగా నగరంలో ఆటో ఫైనాన్స్‌ కన్సల్టెంట్‌ కార్యాలయాలపై కొందరు రౌడీమూకలు చేసిన దాడులు ప్రజల్ని  భయాందోళనలకు  గురి చేశాయి.  ఈ రౌడీమూకలు పేట్రేగిపోవడం వెనుక వారికి కొందరు రక్షణ కవచంలా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రౌడీమూకల్లో కొందరు నూనూగు మీసాలున్న వారు కూడా ఉండటం కలవరపరుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబుకు చెందిన రామ్‌సాయి ఫైనాన్స్‌తో సహ నగరంలో పలు ఫైనాన్స్‌ సంస్థలపై కొందరు రౌడీమూకలు సినీ ఫక్కీలో ఇనుప రాడ్లు, కత్తులతో దాడి చేసి ఆయా సంస్థలకు ఆర్ధికంగా తీవ్ర నష్టం కలిగించారు. ఆ సమయంలో వీరికి  అడ్డు చెప్పే సాహసం ఎవరూ చేయలేకపోయారంటే వీరు ఎంతగా వీరంగం సృష్టించి భయభ్రాంతులను చేశారో అర్ధమవుతోంది. ఒక వేళ అడ్డు చెప్పితే ఏం జరిగి ఉండేదో ఊహకు అందని పరిణామం. దీనిపై చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఆటో ఫైనాన్స్‌ సంస్థలు తీవ్ర ఆందోళన,నిరసన వ్యక్తం చేయడంతోనే పోలీస్‌ యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఈ ఘటనతో పాటు మూడు రోజుల క్రితం ఆల్కట్‌గార్డెన్స్‌లో తెదేపా కార్పొరేటర్‌ గొందేశి మాధవిలత ఇంటిపై కూడా కొందరు రౌడీమూకలు దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆల్కట్‌తోటలో వేంచేసి ఉన్న కన్నమాంబ ఆలయ ఉత్సవాల్లో అర్ధరాత్రి కొందరు యువత హంగామా చేస్తుండటంతో మందలించడంతో ఆగ్రహించిన వారు సదరు కార్పొరేటర్‌ ఇంటిపై దాడి చేసి ఇంటిలోని వారిని భయభ్రాంతులను చేశారు. ఆటో ఫైనాన్స్‌ సంస్థలపై దాడుల విషయంలో ముందుగా రౌడీమూకలు అను క్షణం అత్యంత రద్దీగా ఉండే స్టేడియం రోడ్డులో దాడులకు పాల్పడి ఆ తర్వాత గోదావరి గట్టున గుండువారి వీధికి సమీపంలో ఉన్న రామ్‌సాయి ఫైనాన్స్‌పై దాడికి దిగారు. తొలుత దాడి జరిగిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే మరో దాడిని అరికట్టి ఉండవచ్చనే అభిప్రాయం సర్వత్రా వినిపిసో ్తంది. దీనిని బట్టి పోలీస్‌ యంత్రాంగం పనితీరు అర్ధమవుతోంది. పైగా దాడికి పాల్పడ్డ నిందితులకు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో అయితే బిర్యానీ పొట్లాలు, కూల్‌ డ్రింక్‌లు ఇవ్వడం వంటి రాచమర్యాదలు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆల్కట్‌తోటలో కార్పొరేటర్‌ ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి నేతల ఫిర్యాదుతోనే నిందితులను పోలీస్‌స్టేషన్‌లో పెట్టడం, ఓ రాజకీయనేత వారిని బెయిల్‌పై తీసుకురావడం చూస్తే ఈ నగరంలో ఉన్నత స్థానంలో ఉన్నవారికి, ప్రజాప్రతినిధులుగా ఉన్నవారికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఈ అరాచక శక్తులకు అండగా వెనుక కొందరు రాజకీయ నేతలు ఉన్నారన్న సమాచారం కలవరం కలిగిస్తోంది. ఈ అరాచకశక్తుల్లో నూనూగు మీసాల వారు ఉండటం చూస్తే పదహారేళ్ళ ప్రాయంలోనే వారి జీవితాలతో ఆటలాడుకుంటూ వారిని రౌడీమూకల్లా తయారు చేస్తున్న వారి ఆట కట్టించకపోతే ఎందరో అమాయకుల జీవితాలు బలయిపోయే ప్రమాదం ఉంది. ఇలా ఉండగా నగరంలో నెలకొన్న అరాచక, భయానక పరిస్థితులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నిన్న నగరానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై రాజప్ప కూడా సానుకూలంగా స్పందించి పరిస్థితిని చక్కదిద్దుతానని భరోసా ఇచ్చారు. వెనువెంటనే  హోంమంత్రి రాజప్ప ఈరోజు అర్బన్‌ జిల్లా పోలీసు అధికారులతో నేరాల అదుపునకు, రౌడీమూకల ఆగడాలపై ఆర్‌ అండ్‌ బి అతిధి గృహంలో సమీక్షా సమావేశం జరిపి కఠినమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. కాగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాంతి భద్రతల పరిరక్ష ణకు పోలీస్‌ యంత్రాంగం నడుం బిగించవలసిన అవసరం ఉంది. ప్రశాంత గోదావరి తీరాన ఇపుడిప్పుడే వేళ్ళూనుకుంటున్న రౌడీ సంస్కృతిని మొగ్గ దశలోనే తుంచి వేయకపోతే  మున్ముందు పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉంది.  అందుకు అరాచకశక్తులపై నిఘా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది.