ఇది ఖాయంగా అవకాశవాదమే!

ఇది ఖాయంగా అవకాశవాదమే!
(శనివారం నవీనమ్)

ఏ రాజకీయ పార్టీ అయినా మరో రాజకీయ పార్టీకి మద్ధతు ఇవ్వడమో, ఉపసంహరించుకోవడమో తప్పుకాదు. అయితే దేనికైనా ఒక ప్రాతిపదిక లేదా సూత్రబద్ధత వుండాలి…విస్తృత ప్రజానీకానికి ప్రయోజనకారిగా వుండాలి…ప్రజలకు జవాబుదారీతనం వుండాలి.

ప్రధాని మోడీ, వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మధ్య బుధవారం కుదిరిన అవగాహనలో ఉభయతారకమైన రాజకీయ ప్రయోజనాలే తప్ప ఇవేమీ లేవు.జగన్‌ మాటలు, ఆంధ్రప్రదేశ్  బిజెపి నాయకుల స్పందనల్లో రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కనిపిస్తున్నాయి.

ఏపీలో తెలుగుదేశం తమ ఎమ్మెల్యేలను అక్రమంగా తరలించుకుపోయి కొందరికి మంత్రి పదవులు  కూడా ఇవ్వడంపై జగన్‌ ఢిల్లీ యాత్ర చేసి రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసిన సందర్భంలో ప్రధాని అప్పాయింట్‌మెంటే దొరకలేదు.

ఇప్పుడు అకస్మాత్తుగా జగన్‌కు మోడీ అప్పాయింట్‌మెంట్‌ ఇచ్చి తన వద్దకు పిలిపించుకోవడం ఎందుకో రోజూ పేపర్ చదివే ఎవరికైనా  అర్థమైపోతుంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థి గెలుపు అంత సుళువు కాదు. ఎన్డీయే బయటి పార్టీల మద్దతు తప్పనిసరి. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే మద్దతు కూడగట్టేందుకు జగన్‌తో ప్రధాని చర్చలు జరిపారనేది స్పష్టం.

ప్రధానితో ప్రత్యేక హోదా, భూసేకరణ, టిడిపి ప్రభుత్వ అవినీతి, రైతులకు గిట్టుబాటు ధర తదితర సమస్యలపై చర్చించినట్లు జగన్‌ చెప్పినప్పటికీ అసలు విషయం రాష్ట్రపతి ఎన్నికలన్నది బహిరంగ రహస్యమే!

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇస్తామని జగన్‌ ప్రకటించారంటే బిజెపి నాయకత్వం ప్రయత్నాలు ఫలించాయనే. కేంద్రంలో మోడీ పాలనపై అబ్బురపడి స్వచ్ఛందంగా ముందుకొచ్చామన్న జగన్ మాటలు నమ్మలేము.

బిజెపి అడక్కపోయినా మద్దతిస్తున్నారంటే మోడీ సర్కారుపై ఇప్పటికిప్పుడు ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చిందో, ఏ ఏ అంశాలను మెచ్చారో ఏపీ ప్రజలకు, అందులోనూ టిడిపి-బిజెపి కూటమిని కాదని తనకు ఓటేసిన వర్గాలకు తప్పకుండా చెప్పాలి. అది కనీస బాధ్యత.

గత ఎన్నికల్లో టిడిపి-బిజెపి కూటమికి వ్యతిరేకంగా ఏపీ ప్రజలు జగన్‌కు ఓట్లేశారు. ఇరుపక్షాలకు మధ్య ఓట్ల వ్యత్యాసం ఒక శాతం లోపు. టిడిపి నుంచి మైనార్టీలు, ఎస్టీలు ఒక్కరైనా గెలవకపోవడానికి కారణం ఆ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకోవడమే.

ఎస్సీ నియోజకవర్గాల్లోనూ అత్యధిక సీట్లు జగన్‌పార్టీయే గెలుచుకుంది. ఎన్నికల్లో బిజెపి-టిడిపితో జగన్‌ తలపడినందునే మైనార్టీలు, దళితులు, గిరిజనలు, క్రైస్తవులు, ఇతర పేద, అట్టడుగు వర్గాలు, లౌకిక వాదులు జగన్‌కు బాసటగా నిలిచారు. తన పునాదుల ఆకాంక్షలు, మనోభీష్టాలను కాలదన్ని రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి భేషరతుగా మద్దతు పలకడం ప్రజా వంచనే.

మూడేళ్లలో కేంద్రం రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేకపోగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, తదితర విభజన హామీలకు ఎగనామం పెట్టింది.

ఈ సమస్యలపై బిజెపి ని నిలదీయలేకపోతున్న తెలుగుదేశం మీద మాత్రమే శత్రుత్వాన్ని ప్రదర్శిస్తూ తాను కేవలం టిడిపికే వ్యతిరేకం, బిజెపికి అనుకూలమని చెప్పడం జగన్ అవకాశవాదం. జగన్  ఇరుక్కుపోయివున్న ఆర్ధిక నేరాల కేసులే ఆయనతో ఇలా మాట్లాడేలా చేయిస్తున్నాయని అర్ధం చేసుకోవచ్చు

అయితే, రాష్ట్రపతి పదవికి పోటీ పెట్టడమే తప్పన్నట్లు జగన్‌ మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం కావించడమే. ఎన్‌డిఏకు మెజార్టీ వుంటే వుండి వుండవచ్చు. గతంలో యుపిఏకి మెజార్టీ ఉన్నా ఎన్‌డిఎ పిఎ సంగ్మాను నిలబెట్టింది. ఇప్పుడు ప్రతిపక్షాలది తప్పయితే అప్పుడు బిజెపిది కూడా తప్పే. వాజపేయి ప్రధానిగా ఉండగా ఎన్‌డిఎ అభ్యర్థిగా అబ్దుల్‌ కలాం రంగంలో దిగినప్పుడు వామపక్షాలు లక్ష్మీ సెహగల్‌ను పోటీలో నిలపడం కలాంపై వ్యక్తిగత ద్వేషంతో కాదు. ఆయనకు మద్ధతు ఇచ్చిన బిజెపిని చూసే. పార్టీలు సిద్ధాంతాలపై ఆధారపడాలే తప్ప అవకాశవాదంపై కాదు.

ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లు తప్ప తమకు, బిజెపికి మధ్య వ్యతిరేకాంశాల్లేవంటున్న జగన్ . 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ, ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో బిల్లుకు సవరణలను ప్రోత్సహిస్తున్న బిజెపికి ఆయన ఎలా వత్తాసు పలుకుతారు?