అల్లూరి కాంస్య విగ్రహానికి పుష్కర్‌ఘాట్‌ వద్దే స్థలం కేటాయించాలి

జూలై4 అల్లూరి జయంతినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుచే విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు.
అల్లూరి విగ్రహానికి పుష్కరఘాట్‌ వద్ద స్థలం కేటాయించకపోతే ఆమరణ దీక్షకు పూనుకుంటాం.
రాజమహేంద్రవరం, మే 16 : ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు నిలువెత్తు కాంస్య విగ్రహానికి పుష్కరఘాట్‌ వద్దే స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.  మోరంపూడిలో రూపుదిద్దుకుంటున్న అల్లూరి  కాంస్య విగ్రహం ముందస్తు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అల్లూరి జీవించిన 27 సంవత్సరాల్లో  సగం జీవితం రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌ పరిసర ప్రాంతాల్లో నివశించారని, ఈ ప్రాంతాల్లోనే మున్సిపల్‌ పాఠశాలల్లో 6వతరగతి వరకు చదువుకున్నారని అన్నారు.  ఇలా అల్లూరి చరిత్ర పుష్కరఘాట్‌తో ముడిపడి వున్నందున ఆయన కాంస్య విగ్రహానికి అక్కడే స్థలం కేటాయించి, రానున్న జూలై 4 అల్లూరి 120వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇక్కడే జరపాలని, ఈ సందర్భంగా రాష్ట్ర అల్లూరి సీతారామరాజు యువజన సంఘం రూపొందిస్తున్న అల్లూరి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించాలని పడాల కోరారు. పుష్కరఘాట్‌లో అల్లూరి విగ్రహానికి స్థలం కేటాయించకపోతే అల్లూరి మేనల్లుడు జి.వి.సత్యనారాయణరాజుతో కలసి తాను ఆమరణ దీక్షకు పూనుకోవల్సి వస్తుందని పడాల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అల్లూరి కాంస్య విగ్రహం ముందస్తు విగ్రహాన్ని ఆర్యాపురం కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకర్రావు ఆవిష్కరించి,విగ్రహానికి రూ. 25 వేల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేస్తూ మరి కొంత మంది మిత్రులచే విరాళాలు ఇప్పించగలనని చల్లా హామీ ఇచ్చారు. ఆర్యాపురం బ్యాంక్‌ డైరెక్టర్‌ సూరంపూడి శ్రీహరి, రాష్ట్ర అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యదర్శి మాదేటి రవిప్రకాష్‌, కోశాధికారి బళ్ళా శ్రీనివాస్‌ (మయూరి శ్రీను), అల్లూరి కాంస్యవిగ్రహ శిల్పి పట్నాల శ్రీధర్‌, రాధారాణి  పాల్గొన్నారు.