సత్యనిష్టపై దమననీతి – (శనివారం నవీనమ్)

సత్యనిష్టపై దమననీతి – ఎన్ డి టి వి పై సిబిఐ దాడి
(శనివారం నవీనమ్)

అధికారంలో వున్న రాజకీయపార్టీలు తమను విమర్శించేవారిని భయపెట్టి నోరుమూయించే ప్రయత్నాలు, నిర్బంధాలు, వేధింపులు భారతీయ వార్త సంస్థలకు, పాత్రికేయులకు కొత్తవేమీ కావు.

తాజాగా ఎన్‌డిటివి న్యూస్‌ ఛానల్‌ పై బిజెపి నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్త్ను ధోరణి ప్రజాస్వామ్యాన్ని పాతరేసే విధంగా ఉంది.

ఎప్పుడో ముగిసి పోయిన కేసును సాకుగా చూపుతూ సిబిఐ అధికారులు ఎన్‌డిటివి కార్యాలయంలోకి ప్రవేశించి సోదాలు నిర్వహించడం వెనుక, సిబిఐ చెప్పిన కారణాల కన్నా రాజకీయ కారణాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఛానల్‌ కార్యాలయంతో పాటు, దాని వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్ నివాసాలపై కూడా దాడులు చేయడం ఉద్దేశ్య పూర్వకంగా వేధింపే

వార్తా సంస్థల కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశించడమన్నది తీవ్రమైన చర్య!

మొదటి నుండీ ప్రజాతంత్ర పోరాటాలకు, అభ్యుదయ శక్తులకు వామపక్షాల కార్యక్రమాలకు ఆ ఛానల్‌ ఊతంగా నిలిచింది . ఇటీవల కాలంలో దేశభక్తి పేరుతో ప్రజలపై రుద్దుతున్న మతోన్మాదాన్ని, కాషాయ కట్టుకథలలోని వాస్తవాలను ఆ ఛానల్‌ ప్రజల ముందుంచడాన్ని జీర్ణించుకోలేకే కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్న అభిప్రాయం ఈదాడి తరువాత దేశవ్యాప్తంగా ప్రెస్ క్లబ్బుల్లో పలు చర్చా వేదికల్లో వ్యక్తమవుతోంది. ఎన్‌డిటివి యాజమాన్యం కూడా ఇదే విధమైన ప్రకటనను విడుదల చేసింది.

గత ఏడాది పఠాన్‌కోట ఉదంతం సందర్భంగా అభ్యంతరకర దృశ్యాలను ప్రసారం చేశారంటూ ఎన్‌డిటివి హిందీ ఛానల్‌ ప్రసారాలను ఒక రోజుపాటు నిలిపివేయాలని కేంద్ర సమాచార శాఖ ఆదేశించడం కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. దీనిపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం కావడం, అప్పటికే కేంద్ర మంత్రులు, సైనికాధికారులు చెప్పిన విషయాలనే ఆ ఛానల్‌ ప్రసారం చేసిందని సాక్ష్యాధారాలతో కూడా నిరూపితం కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రసారాల నిలిపివేత ఆదేశాలపై వెనక్కి తగ్గింది. అయితే, జరిమానా విధించింది.

తాజా ఉదంతంలో రుణాన్ని తీర్చకుండా ఆర్థిక నేరానికి పాల్పడి ఐసిఐసిఐ బ్యాంకుకు 48 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారన్నది ఎన్‌డిటివి యాజమాన్యంపై ఆరోపణ. ఈ మేరకు మాజీ కన్సల్టెంట్‌ ఒకరు చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఆరోపణల్లోని వాస్తవాలను ఏమాత్రమూ నిర్ధరించుకోకుండానే దర్యాప్తు సంస్థ కొన్ని వ్యాఖ్యలను చేయడం, ఏకంగా దాడులకు దిగడం విస్మయాన్ని కలిగిస్తుంది.

ఐసిఐసిఐ బ్యాంకు సిబిఐకి గానీ, ఇతర దర్యాప్తు సంస్థలకు గానీ ఎటువంటి ఫిర్యాదూ చేయకపోవడం గమనార్హం. ఐసిఐసిఐ బ్యాంకుకు పూర్తి మొత్తం చెల్లించేశామని, తమకు ఎటువంటి బకాయిలూ లేవని కొన్ని సంవత్సరాలుగా ఎన్‌డిటివి యాజమాన్యం ఆధారాలతో సహా చెబుతూనే ఉంది.

ఇప్పుడు సిబిఐకి ఫిర్యాదు చేసిన వ్యక్తే ఇదే అంశంపై 2013 ఏప్రిల్‌లో ఆర్‌బిఐకి లేఖ రాశాడు. 2016లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. దీనిపై హైకోర్టు ఇప్పటికే ఆయనకు చివాట్లు కూడా పెట్టింది. ఆ కేసు విచారణ ఇంకా సాగుతుండగానే ఆయన సిబిఐని ఆశ్రయించడం, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మినహా మరే ఆధారాలు లేకుండా సిబిఐ దాడులకు దిగడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

దర్యాప్తు సంస్థలను స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కాంగ్రెస్‌ సర్కారు కూడా ఇదే పనిచేసి అభాసుపాలైంది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వమూ అదే బాటలో నడుస్తోంది.

అధికార దుర్వినియోగం కాంగ్రెస్ హయంలో వ్యక్తుల పరంగా జరిగేది. బిజెపి హయంలో వ్యవస్ధాగతమైపోతున్నట్టు వుంది. ఈ పరిస్ధితి సత్యనిష్టకు కట్టుబడిన భారతీయ పాత్రికేయానికి పెను సవాలుగా మారుతున్నది.

పత్రికా స్వేఛ్చపై ఇటీవల ఒక అంతర్జాతీయ సంస్థ 190 దేశాల్లో సర్వే చేయగా భారత్‌కు 136వ స్థానం దక్కింది. నిత్య సంక్షోభంలో చిక్కుకుని, యుద్ధ రంగాన్ని తలపించే పాలస్తీనా ఈ సర్వేలో మనకన్నా ఒక ర్యాంకు ముందుంది. ఆఫ్ఘనిస్తాన్‌ 120వ స్థానంలో ఉంది. ఒమన్‌, ఖతార్‌లతో పాటు గల్ఫ్‌ దేశాలవీ మెరుగైన స్థానాలే. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమంటూ, భావ ప్రకటనా స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నామంటూ పాలకులు పదేపదే చేసిన ప్రకటనల్లోని డొల్లతనాన్ని ఈ నివేదిక బట్టబయలు చేస్తోంది.