దేవాదాయశాఖ ట్రస్ట్‌ బోర్డుల్లో దేవాంగులకు ప్రాధన్యత నివ్వాలి

నగర దేవాంగ సంఘం ప్రధాన కార్యదర్శి కాలెపు సత్యనారాయణమూర్తి
రాజమహేంద్రవరం, జూన్‌  11 : దేవబ్రాహ్మణులైన దేవాంగ సంఘీయులకు దేవాదాయశాఖ ట్రస్ట్‌బోర్డులో ప్రాధాన్యత కల్పించాలని  నగర దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కాలెపు సత్యనారాయణమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వరస్వామి కళ్యాణమండపంలో జరిగిన అన్నవరం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యునిగా నియమితులైన రొబ్బి విజయశేఖర్‌ సత్కార సభకు సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన దేవబ్రాహ్మణులైన దేవాంగులకు దేవాదాయ శాఖ ట్రస్ట్‌ల్లో రాష్ట్రంలోనే ఎక్కడా ప్రాధాన్యత కల్పించక పోవడం దురదృష్టకరమని అవేదన చెందారు. ఇకనైనా ప్రభుత్వం దేవాంగులకు ప్రాధాన్యత కల్పించి దేవాదాయ శాఖ ట్రస్ట్‌ల్లో, కార్పొరేషన్‌ల్లో నియమించాలని సత్యనారాయణమూర్తి ప్రభుత్వానికి కోరారు.  ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యుడు రొబ్బి విజయశేఖర్‌ దంపతులను సత్యనారాయణమూర్తి శాలువా కప్పి, భారీ సన్మాన పత్రాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. అలాగే సీతానగరం తాశీల్దార్‌గా పనిచేస్తున్న దేవాంగ ప్రముఖుడు కనకం చంద్రశేఖర్‌ను కూడా ఆయన సత్కరించారు. తొలుత నగర దేవాంగ సంఘం కార్యదర్శి చింతా చలపతి రావు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టు పడాల వీరభద్రరావు, బీర శ్యామలరావు, కె.కె.సంజీవరావు, వేమన నాగభూషణం, కార్పొరేటర్‌ ద్వారా పార్వతి సుందరి, పడాల శివరామలింగేశ్వరరావు, బళ్ళా శ్రీనివాస్‌ (మయూరి శ్రీను), పుత్సల రామకృష్ణ, అల్లాడ సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.