డిపార్ట్‌మెంటల్‌ హోమ్‌ 

మనస్సాక్షి
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నది కొంచెం పాత కాలం నాటి మాట. అయితే యిప్పుడు దాన్ని తిరగరాసే పనిలో పడ్డాడు వెంకటేశం. వెంకీ పెళ్ళి ఆ వెంకీ చావుకే వచ్చి పడ్డట్టయింది. అదే… మన వెంకటేశం తన పెళ్ళితో తనే యిబ్బందుల్లో పడిపోయాడు. ‘అదేంటీ… పెళ్ళి కోసం వెంకటేశం తెగ ఉబలాటపడిపోయేవాడు కదా… మరి దేంటీ’  అంటే  ‘ ఆ పెళ్ళి… చేసుకోవడం అంటే  చావు కొని తెచ్చుకోవడం లాంటిదే లెద్దూ… అని ఒకళ్ళిద్దరు అనుభవజ్ఞులు తల నిమురుకుంటూ చెపుతుండొచ్చు గాక. అయితే వెంకటేశం విషయం వేరు. వెంకటేశానికి గ్రూప్‌ 1 లో ప్రయత్నాల తర్వాత సబ్‌ రిజిష్ట్రార్‌గా సలక్షణమయిన ఉద్యోగం రావడం జరిగింది. యింకేముంది ఝామ్మని మంగతాయారుతో పెళ్ళి కూడా అయిపోయింది. మంగతాయారు కూడా బాగా చదువుకున్నదే. పైగా వెంకటేశం ఎలా ఉండాలనుకున్నాడో అలాగే ఉంటుంది. అయితే యింటర్నెట్‌లో ఎక్కువగా దూరడం అలవాటు. అదే వెంకటేశం కొంపముంచింది. నెట్‌లో తను చూసిన విషయాల గురించి మంగతాయారు బోల్డంత ఉబలాటంగా చెప్పేది. వెంకటేశం అవన్నీ వినేసి ఊరుకునేవాడు. అయితే ఆ రోజు చెప్పిన విషయం మాత్రం అలా ఊరుకునేలా లేదు. ” ఏవండీ…జయలలితని చూడండి నూట యాభై చెప్పుల జతలు, వందల కొద్ది నెకె ్లస్‌లు, యింకా వేల కొద్దీ చీరలు ఉన్నాయట” అంది కళ్ళింత చేసుకుని. అది విని వెంకటేశం కొంచెం అసహనంగా చూశాడు. ” ఆ…ఈవిడదేవుందిలే…వేరే దేశంలోనూ యిలాంటి సరదాలు ఉన్నోళ్ళు యింకా ఉన్నట్టున్నారు” అన్నాడు. మంగతాయారు వెంటనే  ” అవునండీ…ఫిలిప్ఫీన్స్‌ని ఒకప్పుడు పాలించిన ఇమెల్డా కయితే  యివన్నీ యింకో నాలుగింతలు ఎక్కువే ఉన్నాయి” అంది.  వెంకటేశం ఓహో అనేసి పైకి లేవబోయాడు. అప్పుడు మంగతాయారు అసలు విషయంలోకి వచ్చింది. ” ఏవండీ.. మనం కూడా అలాగే అన్నేసి కొనుక్కుందామా?” అంది. దాంతో వెంకటేశం అయితే  మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్టుగా అదిరిపోయాడు. ” అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్ధమవుతుందా? అన్నాడు. అయినా అవన్నీ కొనే స్తోమత మనకెక్కడిది?” అన్నాడు. దాంతో మంగతాయారు ఆ మాత్రం తెలీదా అన్నట్టుగా చూసి ” అదేంటండీ… మీరు బ్రహ్మండమైన ఉద్యోగంలో ఉన్నారు కదా.  ఎంత దున్నేయెచ్చని”…అంది. దాంతో వెంకటేశం ‘ఖచ్చితం’గా అస్సలు కుదరదు…అలా అడ్డదారిలో సంపాదించడం నా కిష్టం లేదు” అని తేల్చి చెప్పేశాడు. దాంతో మంగతాయారు మొహం మాడ్చుకుని అక్కడ్నుంచి లోపల కెళ్ళిపోయింది. యిక ఆ రోజు నుంచి వెంకటేశం యింట్లో నరకం మొదలయింది. అలాగని మంగతాయారేవీ ఆనాటి సూరేకాంతంలా పూటపూటకీ గొడవలు చేయడం లేదు. మౌనంగానే ఉండి మొహంలో భావాలతో  చంపేస్తోందంతే. వెంకటేశానికయితే అసలు పెళ్ళెందుకు చేసుకున్నానురా బాబూ’ అన్న పరిస్ధితి వచ్చేసింది. యిలాంటి పరిస్థితి కొన్నేళ్ళు నడిచింది. పోనీ మంగతాయారు ముచ్చటేదో తీర్చేద్దామంటే తను నీతి నియమాలకి తిలోదకాలు యిచ్చెయ్యాలాయె. సరిగ్గా అలాంటి పరిస్థితిల్లో జరిగిందది.
———–
ఆరోజు వెంకటేశం భోజనం చేస్తున్నప్పుడు ” మనం యిల్లు మారబోతున్నాం. ఆలా పెద్ద యింట్లోకి వెడుతున్నాం” అన్నాడు. దాంతో మంగతాయారు ఆ .. ఈ బోడి  సామాన్లకి అంత అవసరమా?’ అన్న ఎక్స్‌ప్రెషనొకటిచ్చింది. యింతలో వెంకటేశం మళ్ళీ ” మరి వందలకొద్దీ చెప్పుల జతలూ, బట్టలూ, వాచీలు లాంటివి పెట్టుకోవడానికి ఈ ఇల్లు సరిపోదుగా” అన్నాడు. దాంతో మంగతాయారు మొహంలో వెలుగొచ్చేసింది. కూరలవీ కొసరి కొసరి మరీ వడ్డించేసింది.
————
వారం తిరక్కుండానే  వెంకటేశం వాళ్ళు కొత్తింటికి మారిపోయారు. యిల్లయితే బ్రహ్మండంగా ఉంది. అయితే  యింకా ఆ వందలకొద్ది వస్తువులే లేవు. యింట్లోకి దిగిం తర్వాత వెంకటేశం” యిదే కాదు. ఈ పక్కిల్లు కూడా మనం తీసుకోబోతున్నాం” అన్నాడు. దాంతో మంగతాయారు అదిరిపడి అదెందుకండీ…” అంది దాంతో వెంకటేశం ‘అదెందుకన్నది తర్వాత నీకే అర్ధమవుతుంది” అన్నాడు. రెండ్రోజుల తర్వాత ఆ పక్కిల్లు కూడా తీసుకున్నట్లుగా  చెప్పాడు. అంతే కాదు… ఆ రోజు అర్ధరాత్రి  వెంకటేశం తన యింటికీ, ఆ పక్కన తీసుకున్న యింటికి మధ్య నున్న తలుపులు తెరిచాడు. మంగతాయారుని ఆ గుమ్మంలోంచి పక్కింట్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ కనిపించింది చూసి మంగతాయారు కళ్ళు చెదిరిపోయాయి. దానిక్కారణం ఆ యింటినిండా ఎటు చూసినా చెప్పుల జతలు, వాచీలు, బట్టలు లాంటివి వందల్లో, వేలల్లో కనిపిస్తున్నాయి. అసలు అవన్నీ చూస్తుంటేనే మతిపోతోంది. ‘ నీతి కబుర్లు చెప్పే తన పతిదేవుడు యిలా ఎలా మారిపోయాడన్నదే బొత్తిగా అర్ధం కావడం లేదు. యింతలో వెంకటేశం ” నీకు తెలుసు కదా యిదంతా అక్రమంగా సంపాదించిన దాంతో  కొన్నది. బయటకు యివేమీ తేవడానికి కుదరదు. అందుకే నువ్వుయితే బయటకు వేసుకు వెళ్ళడానికి లేదు. కావాలంటే బాగా పొద్దు పోయాక అంటే అర్ధరాత్రి పూట యిక్కడకొచ్చి చూసుకుని ఆనందిస్తుండు. సరేనా…” అన్నాడు. దానికి మంగతాయారు ” ఆ…అలాగేనండీ” అంది హుషారుగా.
 ———
మర్నాడు వెంకటేశం తారాచంద్‌కి ఫోన్‌ చేశాడు. ” చాలా థేంక్స్‌ రా…”’ అన్నాడు. అవతల్నుంచి తారాచంద్‌ కూడా… ” మరేం ఫర్వాలేదురా. అయినా నీ గురించి నీకు తెలీదా…. మీ ఆవిడ వాటిని చూసి  ఆనందించుకుంటుంటే నాకు పోయేదేవీ ఉండదు కదా” అన్నాడు. అలా అనేసి ఫోన్‌ పెట్టేశాడు. యింతకీ వెంకటేశం మాట్లాడింది ‘ తారా డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌”  యజమాని అయిన తారాచంద్‌తో. యింతకీ ఆ షాపునకు గాంధీనగర్‌లో  ఫోర్త్‌  క్రాస్‌ లేన్‌లో ఎంట్రన్సూ, ఫిఫ్త్‌ క్రాస్‌ లేన్‌లో వెనుక భాగం ఉన్నాయి. అంటే మొత్తానికి ఆ షాపేదో రెండు వీధుల్లోకి ఉంది. అయితే షాపు వెనుక వైపున్న భాగం వెంకటేశం ఉంటున్న  యింటికి ఆనుకుని ఉంది. యింతకీ వెంకటేశం అర్ధరాత్రి తలుపులు తీసుకుని వెళ్ళి మంగతాయారుకి చూపించింది ఆ షాపులోకి వస్తువులే….!
———
” గురూ గారూ… నా కలాంటి కలొచ్చింది. ఈ లెక్కన పెళ్ళి చేసుకోవాలంటే యిన్ని వంకర తెలివితేటలూ,మేనేజ్‌మెంటూ అవసరమంటారా? అన్నాడు” వెంకటేశం దిగాలుగా. గిరీశం నవ్వేసి ” యిప్పడు నీకు సంబంధాలేవీ రావడం లేదు కదా. యింకా గొడవ వదిలేసి అసలు నీకి కలెందుకు వచ్చిందో  అదాలోచించు” అన్నాడు.  దాంతో వెంకటేశం కొద్దిగా ఆలోచించి ఈ మధ్య ఓ పెద్ద ఆఫీసరు గారి మీద ఏసీబి వాళ్ళు రెయిడ్‌ చేసినపుడు యిలాగే వందలకొద్దీ చెప్పులూ, వాచీలు , నెక్లెస్‌లు దొరికాయి కదా. అదే నా కలలో దూరినట్టుంది. అతగాడే కాదు. యిలా అడ్డదారిలో సంపాదించే వాళ్ళలో చాలా మంది విషయంలో యిలాంటి విన్యాసాలు చూడొచ్చు. అయినా బడాయి కాకపోతే ఎవరికయినా పదో, పదిహేనో జతల బట్టలు ఉండొచ్చు. అంతేగానీ వందలకొద్దీ జతలు ఎందుకంట? అలాగే  మనం ఒక్క  వాచీనే అయిదూ, పదేళ్ళూ వాడతామే. మరి వందలకొద్ది ఎందుకంట…అలాగే చెప్పులు కూడా! చరిత్రని పరిశీలించినప్పుడు నిజాయితీగా సంపాదించిన వాళ్ళెవరయినా యిలా వందలకొద్దిగా కొన్నట్టు దాఖలాలు లేవు. అడ్డదారుల్లో వచ్చి పడిపోయే ఈజీమనీతోనే యిలాంటి పైత్యం పనులు చేసేది…ఇమెల్డా, జయమ్మ పోయినప్పుడేమీ పట్టుకెళ్ళలేదు అంటూ తేల్చాడు. ఆ… బాగా చెప్పావోయ్‌ అన్నట్టుగా  చూసి గిరీశం యింకో చుట్ట అంటించుకున్నాడు.
డా. కర్రి రామారెడ్డి