సినారె మృతికి గన్ని కృష్ణ సంతాపం 

రాజమహేంద్రవరం, జూన్‌ 12 :  ప్రఖ్యాత సినీ గేయ రచయిత, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి. నారాయణరెడ్డి మృతి సాహితీ రంగానికి తీరని లోటని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ నివాళులర్పించారు. దివంగత నందమూరి తారక రామారావుకు అత్యంత ఆప్తుడైన సినారెను సినీ రంగానికి పరిచయం చేసి తొలిసారిగా గులేభకావళి కథ చిత్రంలో  ”నన్ను దోచుకుందువటే…వన్నెల దొరసాని” అనే గీతాన్ని రాయించుకున్నారని గుర్తు చేశారు. సినారెను తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాజ్యసభకు నామినేట్‌ చేశారని గుర్తు చేశారు.  తల్లా-పెళ్లామా ? చిత్రంలో ‘తెలుగు జాతి మనది’ అనే పాట ద్వారా జాతి ఖ్యాతిని నలుచెరలా చాటి చెప్పారని అన్నారు.  మూడు వేలకు పైగా పాటలు రచించి సమాజానికి మేలైన సందేశాన్ని చాటి చెప్పారని కొనియాడారు. ” ఏకవీర, అక్బర్‌ సలీమ్‌ అనార్కలి’ చిత్రాలకు అద్భుతంగా సంభాషణలు అందించారని అన్నారు.