పేద ప్రజలకు సన్న బియ్యం కేజీ రూ.36కు అందిస్తున్నాం : సబ్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌

రాజమహేంద్రవరం, జూన్‌ 16 : నాణ్యమైన బియ్యం అందించడం వలన ప్రజలు మంచి ఆహారం తినగలుగుతున్నారని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పేర్కొన్నారు. స్థానిక క్వారీ రైతుబజారులో కిలో రూ.36కు అందించే కౌంటర్‌ను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సన్న బియ్యం (బి.పి.టి) అమ్మకాలు నిర్వహించడం జరుగుతుందని, అందరూ వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామాన్య ప్రజలకు బియ్యం అందుబాటులో ఉండే విధంగా రాజమహేంద్రవరం నగరంలో ఆరు రైతుబజార్ల నందు సన్న బియ్యం అందుబాటులోకి తేవడం జరిగిందని, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా చొరవతో జిల్లా రైసు మిల్లర్ల సహకారంతో రైతుబజార్ల నందు కేజీ 36 రూపాయలకు అమ్మకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ రేట్లు ఎక్కడైనా అమ్మితే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎయస్‌ఓ ప్రసాద్‌, అర్బన్‌ తహశీల్దార్‌ టి.రాజేశ్వరరావు, ఎంఎస్‌ఓ ఎం.శ్రీనివాస్‌, రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారి వి.భాస్కరరావు, కుక్కల ప్రభాకరరావు, టి.నిర్మల పాల్గొన్నారు.