సామాజిక సాహిత్యం – సినారె జ్ఞాపకం (శనివారం నవీనమ్)

సాహిత్యమంటే బోర్ అనో, అది ఎవరికీ అవసరం లేని ఒక లైక్ మైండెడ్ గ్రూపో  (కొందరు ఉబలాటపరుల గుంపు) అనో ముఖ్యంగా యువతరం భావించకుంటున్న సమయంలో “సినారె” మరణం – సమాజానికి సాహిత్యానికి మధ్య సంబంధాన్ని గుర్తు చేస్తున్న పెద్ద జ్ఞాపకం.

మధ్యతరగతి కుటుంబీకుడైన సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) మట్టి మనిషికి పట్టం కట్టిన అక్షరయోధుడు.

1988లో ఆయనకు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని సాధించిపెట్టిన ‘విశ్వంభర’ కావ్యం మట్టికి, మనిషికి సంబంధాన్ని విశ్లేషించింది. నిర్వచించింది. విశ్వంభర అంటే మట్టి అని అర్థం. సామాజిక చైతన్యమే కవిత్వ ప్రధాన లక్ష్యం కావాలన్న ఆయన ఆశయం విశ్వంభరలో కనిపిస్తుంది. మానవ పరిణామ క్రమం, సృష్టి మార్మికత, అల్పత్వం, జ్ఞానం, లొంగుబాటు, ఎదురీత వంటి తాత్వికతల గురించి ఇందులో చర్చించారు.

సినారె నిత్య చైతన్యశీలి. అంతకుమించిన గొప్ప మానవతావాది. సామ్యవాదం, ప్రగతిశీల మానవతావాదమే తన మార్గమని స్పష్టంగా నిర్ద్వంద్వంగా ప్రకటించిన ధీశాలి. సోవియట్‌ యూనియన్‌ పతనమైనప్పుడు కమ్యూనిజానికి కాలం చెల్లిందని పెట్టుబడిదారులు సంబరపడుతున్న వేళ ‘ఎవడురా అన్నది కమ్యూనిజం చచ్చిపోయిందని…ఎవడురా కూసింది ఎర్ర జెండా నేలకొరిగిందని’ అంటూ గర్జించాడు. సామ్యవాదం పట్ల ఆయనకున్న తిరుగులేని విశ్వాసమే ఆయనతో అలా పలికించింది. హిందూత్వ మూకలు చెలరేగి బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు ఖండించిన కవి సినారె.

అధ్యాపకుడిగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, సాంస్కృతిక మండలి చైర్మన్‌గా, అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతిగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన వివిధ పదవులు చేపట్టి, వాటికి వన్నె తెచ్చారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ‘రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకేవరకు… పోతూ పోతూ రాస్తాను’ అని కవితాత్మకంగా చెప్పిన సినారె చివరి దాకా అదే స్ఫూర్తితో అక్షర యాత్ర సాగించారు. రెండు వేలకు పైగా సాహితీ సదస్సులు, సభల్లో పాల్గొని విలువైన సందేశాలను ఇచ్చారు.

తెలుగు సాహిత్యాన్ని జ్ఞానపీఠ్‌తో సత్కరించిన సి నారాయణరెడ్డి నిరంతర ప్రయోగశీలి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆధునిక సాహిత్య చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పద్యాలు, కవితలు, సినిమా పాటలు, గజళ్లు కథలు ఇలా ప్రతి ప్రక్రియలోనూ ఆయనది అందెవేసిన చెయ్యి. ఆయనకు జ్ఞానపీఠ్‌ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ కావ్యం ఒక ఎత్తు అయితే, కర్పూర రంగరాయలు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు, రుతు చక్రం మరో ఎత్తు.

1931లో కరీం నగర్‌ జిల్లా వేములవాడకు సమీపంలోని హన్మాజీపేట అనే ఓ గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో నారాయణరెడ్డి పుట్టారు. డిగ్రీవరకు ఉర్దూ మీడియంలో చదివినా, తెలుగు, సంస్కృత భాషలపై మంచి పట్టు సాధించారు. పదమూడవ ఏటనే పద్యాలు రాయడం మొదలెట్టారు. కాలేజీ రోజుల్లోనే ‘శోభ’ అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ,. తెలుగు చదువుతుండగా గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ, జాషువా, విశ్వనాథ, కృష్ణశాస్త్రి రచనలతో పరిచయమేర్పడింది. అభ్యుదయ, విప్లవ కవిత్వానికి శ్రీశ్రీ, భావ కవిత్వానికి రాయప్రోలు, సంప్రదాయ కవిత్వానికి విశ్వనాథ సత్యనారాయణ లబ్ధ ప్రతిష్టులుగా వున్నారు. వారు నడచిన బాటనే వెళితే తన ప్రత్యేకత ఏముంటుందని భావించిన సినారె కొత్త ప్రయోగాలకు పూనుకున్నాడు.

1953లో ‘నవ్వని పువ్వు’ తో మొదలైన ఆయన సాహితీ ప్రస్థానం. ఆయన కలం తొంబైకి పైగా పుస్తకాలు, మూడు వేలకుపైగా సినిమా పాటలు ఇంకా ఎన్నో గజల్స్‌, కథల రచనగా సాగిపోయింది. తెలుగు సాహిత్యంలో గజల్స్‌ను మొట్టమొదట ప్రవేశపెటిన ఘనత ఆయనదే. ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక కొత్త ప్రయోగాలకు ఆద్యుడిగా నిలిచిన సినారె సహజంగానే అభ్యుదయవాది. ఆయన రచనలు అనేకం కన్నడం, మలయాళం, హిందీ వంటి దేశీయ భాషల్లోనే గాక రష్యన్‌, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, జపనీస్‌, ఇటాలియన్‌, అరబిక్‌ తదితర విదేశీ భాషల్లోకి కూడా తర్జుమా అయ్యాయి.

ఎన్టీయార్‌ చొరవపై 1962లో సినిమా రంగంలో ప్రవేశించిన సినారె అక్కడ కూడా విశేషంగా రాణించారు. సన్నివేశానికి, సందర్భానికి అనుగుణంగా అద్భుతమైన పాటలు రాశారు. ‘గులే బకావళి కథ’ చిత్రంలో ‘నన్ను దోచుకుందువటే’ పాటతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం అయిదు దశాబ్దాలకు పైగా సాగింది. ఆణిముత్యాల్లాంటి 3500 పాటలు తెలుగు సినీరంగానికి ఇచ్చారు.

యువ కవులను నిరంతరం ప్రోత్సహించేవారు. ప్రతి జన్మదినం రోజున ఒక కవితా సంపుటి తేవడం గత కొన్నేళ్లుగా ఒక ఆనవాయితీ. కవిత్వమే శ్వాసగా, ప్రగతిశీల మానవతావాదమే లక్ష్యంగా ఎనిమిది పదుల నిండు జీవన ప్రస్థానం సాగించిన సినారె ధన్యజీవి.