ప్రభుత్వ విద్యాలయాల్లో ఎంసెట్‌కు శిక్షణా తరగతులు నిర్వహించాలి

కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో అధిక ఫీజులపై ప్రభుత్వం దృష్టిసారించాలి
రాజమహేంద్రవరం, జూన్‌ 16 : ప్రభుత్వ విద్యాలయాల్లో మెడికల్‌, ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించేందుకు అవసరమయ్యే ప్రవేశ పరీక్షకు శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ ప్రజా సంక్షేమ సంఘం నగర శాఖ అధ్యక్షులు మేరపురెడ్డి రామకృష్ణ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షలకు  శిక్షణ పేరుతో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారన్నారు. ఇంటర్మీడియట్‌ విద్యకు ప్రభుత్వం ఏడాదికి రూ.2,500 ఫీజు నిర్ణయించగా ప్రైవేటు విద్యా సంస్థలు రూ.25వేలు నుంచి 30 వేలు వసూలు చేస్తున్నారని, పుస్తకాలకు రూ.10వేలు అదనంగా విధిస్తున్నారని చెప్పారు.  ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని ప్రభుత్వం అరికట్టి ఫీజుల వివరాలను తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఫీజులను నియంత్రించే వరకు తమ సంఘం తరపున దశలవారీ పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం డివిజన్‌ అధ్యక్షులు ఆర్‌.వి.ప్రసాదరావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మహ్మద్‌ ఖాసిం, ఉపాధ్యక్షులు ఆర్‌.మధువరప్రసాద్‌, నగర యువజన అధ్యక్షులు లచ్చిరెడ్డి సురేష్‌, ఉపాధ్యక్షులు కిలపర్తి గోవిందరాజు, నగర మహిళా అధ్యక్షురాలు పతివాడ రాజేశ్వరి, ఉపాధ్యక్షురాలు పి.అనంతలక్ష్మి, కార్యదర్శి కర్రి రమణమ్మ, సహాయ కార్యదర్శి పనస దేవి పాల్గొన్నారు.